SSMB29 రిలీజ్.. అంత త్వరగా అయ్యే పనేనా?


సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ ‘SSMB29’ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఘనవిజయాల తర్వాత రాజమౌళి పాన్ వరల్డ్ లెవెల్ లో ఈ ప్రాజెక్ట్ ని దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.

రాజమౌళి ఇప్పుడు సినిమా కోసం లొకేషన్ల పరిశీలనలో బిజీగా ఉన్నారు. కథ ప్రకారం ఫారెస్ట్ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు తగిన లొకేషన్ల కోసం జక్కన్న ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రత్యేకమైన లుక్ లో కనిపించబోతున్నాడు. మహేష్, క్యారెక్టరైజేషన్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ నటులను తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 

రాజమౌళి జనవరి ఫెస్టివల్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టి, రెండేళ్లలో పూర్తిచేసి 2027లో విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. గతంలో ‘బాహుబలి’ కోసం 5 సంవత్సరాలు, ‘ఆర్ఆర్ఆర్’ కోసం 3 సంవత్సరాల టైమ్ తీసుకున్న జక్కన్న, ఈసారి కేవలం రెండేళ్లలో ‘SSMB29’ని పూర్తి చేయగలడా అనేది అసలు సందేహం. అయితే, రెండు పాన్ ఇండియా సినిమాల అనుభవం జక్కన్నకు ఉంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌ను చక్కగా ప్లాన్ చేసి ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి, మరో ఏడాది పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించే అవకాశం ఉంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post