పుష్ప 2: ఇంకా దేవిని మార్చలేదు కానీ..!


డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్‌ గురించి హఠాత్తుగా వచ్చిన తాజా వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్‌ని తీసుకురాబోతున్నారనే టాక్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. అధికారికంగా ప్రకటన రాకపోయినా, పుష్ప 1 ది రైజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ మార్పు జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 అల్లు అర్జున్, సుకుమార్ కూడా దేవిశ్రీ కంపోజిషన్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. BGM విషయంలో దేవికి చాలాసార్లు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. పుష్ప 2 కోసం మిగతా ప్రాజెక్టులను కూడా పక్కనేపట్టిన దేవి అనేక వెర్షన్లు ఇచ్చారు. అయినప్పటికీ సంతృప్తి చెందని మేకర్స్ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఫైనల్ గా ఇంకొక అవకాశం కూడా దేవికి ఇచ్చినట్లు టాక్. అయితే ఈ టైమ్ లో రిస్క్ చేయకుండా సేఫ్ జోన్ లో మరో ఇద్దరిని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. తమన్ తో పాటు అజనీష్ లోకనాథ్ పేరు కూడా బజ్‌లో ఉంది. ఆ ఇద్దరితోను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పించాలని చూస్తున్నారు. ఫైనల్ గా ఎవరి అవుట్ పుట్ బాగుంటే వారిది ఫైనల్ చేసే అవకాశం ఉందట. ఏదేమైనా దేవి విషయంలో ఇప్పటివరకు సుకుమార్ నిర్ణయం మార్చుకున్న సందర్భాలు లేవు. మరి ఇప్పుడు అతన్ని కాదని వేరొకరిని తీసుకుంటారేమో చూడాలి.

 సుకుమార్ ప్రస్తుతం బన్నీ, శ్రీలీల స్పెషల్ సాంగ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లు, ట్రైలర్ లాంచ్ నవంబర్ 15న లాక్ చేసుకోవడం, ఓవర్సీస్ డ్రైవ్స్ పంపడం వంటి పనులు కూడా వేగంగా జరగాల్సిన టైమ్‌లో, దేవి స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వడం పెద్ద సాహసమే. మరి చివరికి ఈ వార్త ఎంతవరకు నిజమో, ఫ్యాన్స్‌కు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.

Post a Comment

Previous Post Next Post