నెట్‌ఫ్లిక్స్ బాహుబలి.. ఎంత డబ్బు వేస్ట్ అయ్యిందంటే..?


బాహుబలి ప్రాంచైజ్‌ పాన్‌ ఇండియా సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ బాహుబలి ప్రీక్వెల్‌ సిరీస్‌ తీసుకురావాలని 2018లో ప్రణాళిక చేసింది. బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్ పేరుతో మొదలైన ఈ సిరీస్, రాజమాత శివగామి జీవితానికి సంబంధించిన కథను ఆవిష్కరించాలనే లక్ష్యంతో రూపొందించారు. కానీ రెండుసార్లు టీమ్‌ను మార్చినా, తగిన ఔట్‌పుట్‌ రాకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను నిలిపేసింది.

తాజాగా నటుడు బిజయ్‌ ఆనంద్‌ ఈ సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్ట్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు చేసింది. సిరీస్‌ కోసం నేను రెండు సంవత్సరాలు కష్టపడ్డా. ఆ సమయంలోనే సాహోలో ఒక కీలక పాత్రను వదులుకోవాల్సి వచ్చింది," అని వెల్లడించారు. సిరీస్‌ కోసం భూమికా చావ్లా, మృణాళ్‌ ఠాకూర్‌ వంటి నటీనటులు కూడా సమయాన్ని వెచ్చించారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌ ప్రేక్షకుల అంచనాలను చేరేందుకు అవసరమైన స్థాయిలో ప్రొడక్షన్‌ విలువలు అందించలేకపోయింది.

సిరీస్‌ డైరెక్టర్‌గా దేవకట్టా పనిచేశారు. ప్రస్థానం వంటి విభిన్నమైన చిత్రంతో గుర్తింపు పొందిన ఆయన, ఈ ప్రాజెక్ట్‌ పైన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సిరీస్‌ ఆగిపోవడం ఆయన కెరీర్‌పై కూడా ప్రభావం చూపింది. మరోవైపు, నెట్‌ఫ్లిక్స్‌ ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి చేసిన తర్వాత ఎందుకు నిలిపివేసిందనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాహుబలి స్థాయిలో ఉన్న బ్రాండ్‌ను ఇలా వదిలేయడం నెట్‌ఫ్లిక్స్‌కి పెద్ద నష్టమే. ఈ సిరీస్‌ మరలా ఏ రూపంలోనైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అన్నది ఇప్పటికీ అనుమానంగానే ఉంది.

Post a Comment

Previous Post Next Post