ఆహా OTT: నష్టాల్లో సెంచరీ కొట్టేసింది


తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లాభాల సంగతి పక్కన పెడితే ఊహించని నష్టాలను ఎదుర్కొంటోంది. ఆహా తెలుగులో తొలి స్వదేశీ ఓటీటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తమిళంలోనూ విస్తరించి, స్థానిక సినిమాలు, ఇతర భాషల డబ్బింగ్ కంటెంట్ అందిస్తోంది. ముఖ్యంగా అన్ స్టాపబుల్ వంటి షోలు ఆహాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కానీ నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటం వలన లాభదాయకతలోకి రావడం ఆలస్యం అవుతోంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 105 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఆహాకు వచ్చిన మొత్తం ఆదాయం రూ. 137 కోట్లుగా నమోదు కాగా, ఖర్చులు రూ. 277 కోట్లకు చేరాయి. దీంతో ఆహా ప్రస్తుతం ఇంకా పెద్ద నష్టాలనే భరించాల్సి వస్తోంది. ఇక 2022-23లో రూ. 122 కోట్లుగా ఉన్న ఆదాయం 2023-24లో కొంత పెరుగుదలతో రూ. 137 కోట్లకు చేరింది, అంటే తొమ్మిది శాతం పెరుగుదల. 

ఇదే సమయంలో నష్టాలు 2022-23లో రూ. 120 కోట్ల నుంచి 2023-24లో రూ. 105 కోట్లకు తగ్గాయి. అంటే మొత్తం పదమూడు శాతం మేర నష్టాలను తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్థిరమైన ఆదాయ వృద్ధి, ఖర్చుల నియంత్రణ ద్వారా ఆహా నిలకడ సాధిస్తే, తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో మరింత శక్తివంతంగా ఎదగవచ్చు.

Post a Comment

Previous Post Next Post